||ఓమ్ తత్ సత్||
తతో రావణ నీతాయాః సీతాయాః శతృకర్షనః|
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి||1-1||
ఇది సుందరకాండ లో మొదటి శ్లోకము. దీని తాత్పర్యము ఇది.
తా|| అప్పుడు శత్రువులను కృశింప చేయగల హనుమంతుడు రావణునిచే తీసికొనిపోబడిన సీతయొక్క స్థానమును అన్వేషించుటకు దేవగాయకులగు చారణులు సంచరించు ఆకాశ మార్గమున వెళ్ళవలెనని సంకల్పించెను.
అప్పలాచార్యులు గారు చెప్పినది ఈ శ్లోకములో గాయత్రీ మంత్రములోని పన్నెండవ అక్షరము "వ" కలదు అని. అదే "రావణ" లోని "వ". ఈ శ్లోకమే మహమంత్రమని పూర్వీకుల అభిప్రాయము.
ఈ శ్లోకాని కి గూఢార్థము కూడావుంది అని తత్వార్థ ప్రతిపాదకుల అభిప్రాయము.
అదే శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి తత్వదీపిక లో చెప్పిన మాట.
మనపూర్వీకుల రచనలలో బాహ్యరూపములో కనబడే కథే కాకుండా అంతరార్థము కూడా ఇమిడి ఉన్నది అన్నమాట అప్పలాచార్యుల వారి ప్రథాన అంశము. మాకు కాలేజీలో అభిజ్ఞాన శాకుంతలము చెపుతూ కూడా కొన్ని సన్నివేశాలలో బాహ్యార్థము అంతరార్థము అని చెప్పేవారు. ఆయన తత్వదీపిక అదే మాటని ఉద్ఘాటిస్తుంది.
మన వేదాంతములో ముఖ్యమైన ప్రతిపాదన ఏమిటీ అంటే ఈ విథముగా చెప్పవచ్చు.
పరమాత్మ జీవాత్మ రెండూ ఒకటే అయినా అది అందరికి సులభముగా అర్థము అయ్యే మాటకాదు. ఈ రెండూ ఒకటి కాదు అనుకోడానికి ముఖ్యకారణము కామక్రోథములకి బానిస అయిన మనస్సు. ఆ మనస్సు జీవాత్మని అనేక ప్రయాసలమీద తీసుకుపోతుంది. ఏ ప్రయాసకుడికైనా ఈ మాట అర్థము కావాలి అంటే ఒక గురువు ఉండాలి. అ గురూపదేశములో ప్రయాసకుడు అధ్యయనము ఇంకా అభ్యాసము చేసి మనస్సుని అదుపులో పెట్టి కామక్రోథములను జయిస్తే అప్పుడు పరమాత్మ జీవాత్మ ఒక్కటే అన్న నిజము తెలుస్తుంది. ఈ నిజము ఎన్ని సార్లు గురువుగారు చెప్పినా కాని చివరికి తమ అనుభవ జ్ఞానము ద్వారా లభిస్తుంది.
రామాయణములో బాహ్యర్థమైనది రాముని కథ సీతా చరితము పౌలస్త్య వథ. కాని ఈ కథలే కాకుండా అంతరార్థము కూడా వుంది. అదే పరమాత్మ జీవాత్మల కలయిక.
ఇందులో రాముడు పరమాత్మ. రాముడు పరమాత్మ స్వరూపము. సీత ఆత్మ స్వరూపము. క్షేత్రములో దున్నుచుండ గా నాగటి చాలులో దొరికినది కనుక సీత అనబడెను. శరీరమనే క్షేత్రములో బుద్ధి అనే నాగటి తో తవ్వబడినప్పుడు దొరికెడిది ఆత్మ . అలా సీత ఆత్మస్వరూపము. ఈ రెండూ వేరుగా పడడానికి కారకుడు కామక్రోథములకు ఆటపట్టయిన రావణుడు. వీరి కలయికకు కారణమైన ముఖ్యుడు గురుసమానుడు హనుమ.
ఇదే సుందరకాండలోని మొదటి శ్లోకము యొక్క అంతరార్థమని అప్పలా చార్యులగారి తత్త్వదీపిక.
అదే క్రింద విచారిద్దాము:
తతః- ఆ పరమాత్మ నుండి
రావణనీతాయాః -రావణుని (కామమోహితమైన మనస్సు) చే తీసికొనపోబడిన
సీతాయాః-బుద్ధిచే బయల్పరుబడునది అయిన ఆత్మ ( సీత) యొక్క
పదం- స్థానమును
అన్వేష్టుం- అన్వేషించుటకొరకు
శతృకర్షనః - కామక్రోథములను శత్రువులని జయించినట్టి వాడు
చారిణాచరితే - పూర్వ ఋషులు ప్రవర్తించిన
పథి - మార్గమున
ఇయేష- వెళ్ళుటకు సంకల్పించెను.
ఈ శ్లోకములో జీవుని తరింపచేయగల గురువు యొక్క స్వరూపము ( శతృకర్షనః) తెలియచేయబడినది.
ఇక్కడ హనుమంతుడు భగవదనుగ్రహముచే సిద్ధుడై సంసారసాగరమును తరించి భగవదాజ్ఞచే లంక అనబడు శరీరములో ప్రవేశించి భగవత్ప్రాప్తిని కోరెడి జీవాత్మ ( సీత) ను వెదికి వాని విరోధులను నశింపచేసి జీవాత్మ పరమాత్మల కలయికకు కారణభూతుడుగా మహాపురుషుడుగా కనపడుచుండును.
సీతా రాముల కలయికే ( సీత క్షేమముగా ఉన్న వార్త) ఆత్మ పరమాత్మల కలయిక
అదే సుందరకాండ
|| ఓమ్ తత్ సత్||
|| om tat sat॥
Source: https://www.kasarabada.org/ramayanam%2097T.html
No comments:
Post a Comment