BHĀRATĀVANI
భారతావని
భరతుడు మరియు రఘు రాముడు పాలించిన అవని ఇది
భారతావని;
సీతమ్మ నడయాడిన అవని ఇది భారతావని;
త్రేతా యుగమునుండి రావణ, మారీచ,
సుబాహు,
తాటకిల రాక్షస సంహారమును చవి చెప్పిన అవని ఇది భారతావని;
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణను
తెలియజెప్పి,
శాంతిని నడిపించి నిలిపింపజేసిన అవని ఇది భారతావని.
నాలుగు వేదములను అందించిన
అవని ఇది భారతావని;
కపిల మహర్షి సాంఖ్య యోగమును
అందించిన అవని ఇది భారతావని;
జైమిని వ్యాస మహర్షుల పూర్వ,
ఉత్తర మీమాంసలను
భావితరాలకు అందించిన అవని ఇది భారతావని;
గౌతమ న్యాయ శాస్త్రము, కణాద
వైశేషికమును అందించిన అవని ఇది భారతావని;
పాతంజలి ఉత్కృష్ట యోగ సూత్రములను
అందించిన అవని ఇది భారతావని;
అత్యుత్తమ మేధా సంపత్తిని
మరియు ధార్మిక యోగ విశేషాలను షడ్దర్శనాలతో ప్రపంచమునకు దర్షింపజేసిన అవని ఇది భారతావని.
వేదాంతమును శతాధిక ఉపనిషత్తుల రూపములో అందించిన
అవని ఇది భారతావని;
ఉపనిషత్తుల సారాంశమును శ్రీమత్భగవద్గీతగా భవిష్యత్
మానవాళికందరికీ అందించిన అవని ఇది భారతావని;
భక్తి భావమును ఆలింగనమొనర్చుటకు శ్రీమద్భాగవతమును
అందించిన అవని ఇది భారతావని;
మానవుడు ధర్మ మార్గమున నడయాడుటకు రామాయణ మహాభారతములతో
పాటు పదునెనిమిది పురాణములు మరియు ఉపపురాణములను అందించిన అవని ఇది భారతావని.
గాంధార, శల్య, ద్వారక, జనక, హస్తిన, మగధ, కాశీ,
చోళ, బొబ్బిలి, మరింకెన్నెనో రాజ్యములను తనయందు
సామరస్యంగా మరియు సుభిక్షంగా చూపించిన అవని ఇది భారతావని;
నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలతో భాసిల్లిన అవని
ఇది భారతావని;
సనాతన ధర్మపు వాఙ్మయాన్ని పునరుద్ధరింపచేసి ప్రపంచ
మానవాళికందరికీ మరొక్కమారు అందజేసిన జగద్గురు ఆదిశంకరాచార్యులవారు నడయాడిన అవని ఇది
భారతావని.
మొగలేయులు మరియు ఆంగ్లేయుల కీచక, కిరాతక దాడులకు
అట్టుడికిన అవని ఇది భారతావని;
శివాజీ మహారాజ్, ఝాన్సీ లక్ష్మీబాయ్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్
పటేల్, మహాత్మా గాంధీ వంటి ఎందరో ఉత్కృష్ట స్వాతంత్య్ర సమరయోధులను అందించిన అవని ఇది
భారతావని;
ఎన్నెన్నో దాడులను ఎదురుకొన్న, ఇతరులపై ఎన్నడూ దండెత్తని
శాంతి అవని ఇది భారతావని.
రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మహావతార్ బాబాజీ, లాహిరి మహాశయా, స్వామి శ్రీ యుక్తేశ్వర్, పరమహంస యోగానంద, రమణ మహర్షి, సాయి బాబా, తుకారాం, కబీర్, గురునానక్, నాయానార్ లు, మరియు ఆళ్వార్ లాంటి మహా యోగులను, భక్తులను అందించిన అవని ఇది భారతావని;
త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామా శాస్త్రి, అన్నమాచార్య, పురందరదాసు, సదాశివ బ్రహ్మేంద్ర, రబీంద్రనాథ్ ఠాగూర్, తులసీదాస్ వంటి ఎందరో గొప్ప వాగ్గేయకారులను, కవి పుంగవులను అందించిన అవని ఇది భారతావని;
భరతనాట్య, కూచిపూడి, మోహినియాట్టము, కథక్, ఒడిస్సి వంటి ఎన్నో సాంప్రదాయ నృత్యములను, కర్ణాటక, హిందుస్తానీ సాంప్రదాయ శాస్త్రీయ సంగీతమును అందించిన అవని ఇది భారతావని;
సుశ్రుత, రాజనాథ్ సింగ్, జగదీశ్ చంద్రబోస్, సి వి రామన్, ఆర్యభట్ట, శివ అన్నాదురై, చరక, రామానుజం వంటి ఎందరో విశిష్ట శాస్త్రవేత్తలను అందించిన అవని ఇది భారతావని;
ఇట్టి అవని యందు జన్మించి ఇంతటి ఉత్కృష్ట సంస్కృతిని వారసత్వముగా పొంది నేను నడయాడుటకు భాగ్యమును ప్రసాదింపజేసిన అవని ఇది నా భారతావని.
🙏🧘♂️🙏❤️🙏